పురాతన దేవాలయాలలో జుంటుపల్లి రామాలయం ఒక్కటి. ఈ దేవాలయాన్ని గోల్కొండ నవాబుల కాలంలో కృష్ణవదన్ రావు, శ్యామారావు సోదరులు నిర్మించారు. వీరు జుంటుపల్లి పరిసరాల్లో పర్యటిస్తుండగా కోనేరులో శ్రీరాముని విగ్రహ శిలాఫలకం దొరికింది. తరువాత వారికి కలలో ఆలయ నిర్మాణం చేయాలని ఆదేశం రావడంతో ఆలయం నిర్మాణం జరిగింది. శ్రీరాముని విగ్రహం నుంచి నిరంతరం నీరు ఉబికి రావడం ఇక్కడి విచిత్రం. 400 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై వెలిసిన ఆలయ విగ్రహం నుంచి నీరు రావడం గురించి 4 దశాబ్దాల క్రితం అప్పటి హైదరాబాదు కలెక్టర్ స్వయంగా పరిశీలించినా రహస్యం తెలిసిరాకపోవడముతో ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఆలయ సమీపంలో ఉన్న మరో గుట్టపై సంవత్సరం పొడవునా నడుములోతు నీరు ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు స్నానం చేశారని ప్రతీతి.
ఈ దేవాలయము జుంటుపల్లి ప్రధాన రహదారి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో 400 అడుగుల ఎత్తయిన గుట్టపై ఉంటుంది. ఏటా ఇక్కడ జాతర కూడా ఘనంగా నిర్వహిస్తారు.
చుట్టూ చూడదగినవి.
ఈ దేవాలయం సమీపంలోనే బీమా నది యొక్క ఉపనది అయిన కగ్నా నది ఉంటుంది. దీనిపై జుంటుపల్లి నీటి పారుదల ప్రాజెక్టు కూడా ఉంది. పరిసర ప్రాంతాల ప్రజలు, సెలవు దినాల్లో విద్యార్థులు విహారయాత్రగా ఇక్కడికి వస్తుంటారు.